తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ 41ఏ నిబంధనను పాటించాలని గుంటూరు ఆరండల్ పేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 41ఏ నోటీసు ఇచ్చి ముందుగా వివరణ తీసుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించడం, విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో గత నెల 23న గుంటూరుకు చెందిన కావటి శివనాగమనోహరనాయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా నేత బోండా ఉమ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఆయా పరిస్థితులకు వర్తించవన్నారు. దూషణలకు పాల్పడలేదన్నారు. ఆ సెక్షన్లన్నీ మూడేళ్లలోపు జైలు శిక్ష విధింపునకు వీలున్న నేపథ్యంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం పిటిషనర్‌కు పోలీసులు ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉందని ధర్మాసనానికి వివరించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. 41ఏ నిబంధన పాటించాలని పోటీసులను ఆదేశించారు.