HC notice to govt: రాష్ట్రంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర విద్యా శాఖ కార్యదర్శి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, కళాశాల విద్య కమిషనర్, పాఠశాల విద్య డైరెక్టర్, విద్యాశాఖ రాష్ట్ర కౌన్సిల్(పరిశోధన, శిక్షణ) డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ప్రస్తుత దశలో స్టే ఇవ్వలేమని పేర్కొంది.
నూతన విద్యా విధానంలో పాఠశాల వ్యవస్థ నాశనం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని, బడుల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జారీచేసిన జీవోలను రద్దు చేయాలని కడప, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. టీచర్ల హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీవో 117 అమలును నిలిపివేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అంతకుముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. 1 నుంచి 8 తరగతి వరకు ఒకే మాధ్యమంలో విద్యా బోధన ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొందే కానీ.. అది ఏ మాధ్యమంలో అనేది స్పష్టత ఇవ్వలేదన్నారు.