మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో లోపాల్ని హైకోర్టు ఎత్తిచూపింది. విచారణను సీబీఐకి అప్పగించిన రోజున... దర్యాప్తు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరయ్య , హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ఘటనాస్థలిలో ఆధారాలు చెరిగిపోకుండా, మృతదేహాన్ని కదల్చకుండా చూడాల్సింది పోయి... కొందరి స్వార్థ ప్రయోజనం కోసం స్నానాల గది నుంచి పడక గదికి మృతదేహం మార్చడమేంటని ప్రశ్నించింది. శరీరంపై రక్తాన్ని తుడిచి బ్యాండేజ్ వేశారని, హత్యాస్థలిలో రక్తపుమడుగును పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా... ముఖ్యమైన సాక్ష్యాల్ని చెరిపేశారని మండిపడింది. మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించాక శవ పంచనామా నిర్వహించడాన్ని తప్పుబట్టింది. నేరం జరిగిన చోట శవపంచనామా నిర్వహించాలని, క్లూస్‌టీం ఆధారాలు సేకరించాలని..., కానీ కొందరు స్వార్థపరులు ఉద్దేశపూర్వకంగా కీలక సాక్ష్యాల్ని కనబడనీయకుండా చేశారని హైకోర్టు పేర్కొంది.
వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం హైకోర్టు ప్రస్తావించింది. శవపంచనామా నిర్వహించాకే ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసుగా మార్చారని పేర్కొంది. తన మృతికి డ్రైవర్ ప్రసాదే కారణమంటూ వివేకా రాసినట్లు కనుగొన్న లేఖ గురించి న్యాయమూర్తి ప్రస్తావించారు. విధులకు త్వరగా రమ్మన్నందుకు డ్రైవర్ తీవ్రంగా కొట్టాడని లేఖలో ఉందని గుర్తుచేశారు. అందులోని చేతిరాత మృతుడిదేనని మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నిపుణులు తేల్చారన్నారు. అయితే రెండో అభిప్రాయం కోసం లేఖను హైదరాబాద్ సీఎఫ్ఎస్ఎల్కు పంపారన్నారు. డ్రైవర్ ప్రసాద్ ఇప్పటికీ వివేకా కుటుంబసభ్యుల వద్దే పనిచేస్తుండటం, ఆయనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయకపోవడం చూస్తుంటే... హత్యకు కారణమైనవారే కేసును పక్కదోవ పట్టించేందుకు మృతుడితో బలవంతంగా లేఖ రాయించి ఉండొచ్చని కోర్టు సందేహం వ్యక్తంచేసింది.