ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. బకాయిలు చెల్లించాలని గతేడాది జనవరి 8న న్యాయస్థానం ఆదేశిస్తే.. ఇప్పటి వరకూ చెల్లించకపోవడం ఏంటని మండిపడింది. కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఉత్తర్వులను తేలిగ్గా తీసుకుంటున్నారని, ప్రభుత్వం తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఉపాధిపనుల్లో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయన్న కారణంతో అన్ని పనులకు 20% సొమ్ము కోత పెట్టడమేంటని ప్రశ్నించింది. విజిలెన్స్ విచారణ ఎవరు నిర్వహించారు, ఆ విచారణలో ఏమి తేలిందని కోర్టుకు హాజరైన పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌ను సూటిగా ప్రశ్నించింది. వారు సమాధానం చెప్పలేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. విజిలెన్స్ నివేదికను అధ్యయనం చేయకుండా కోర్టుకు వస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు బుధవారం జరిగిన విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ గైర్హాజరవ్వడంపై మండిపడింది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన అఫిడవిట్లో సైతం సరైన వివరాలు లేవంది.
కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ స్పందిస్తూ.. కోర్టుకు హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నామన్నారు. సమావేశం నిమిత్తం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి దిల్లీ వెళ్లారన్నారు. తదుపరి విచారణకు కోర్టుముందు హాజరవుతారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తప్పక హాజరుకావాలని తేల్చిచెప్పింది. న్యాయస్థానం అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టంచేసింది. రూ.5లక్షల లోపు విలువచేసే ఉపాధి పనులకు రూ.413 కోట్లు జమ చేశామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. గ్రామ పంచాయతీల వారీగా ఎంత చెల్లించారు, ఎప్పుడు చెల్లించారు తదితర పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేపట్టిన పనులకు బకాయిలను రాష్ట్రప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ఈ ఏడాది జులై 15న విచారణ జరిపిన ధర్మాసనం.. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాలని ఆదేశించింది.