గతేడాది సెప్టెంబరులో పిల్ దాఖలు చేస్తే ఇప్పటి వరకూ కౌంటర్ వేయకపోవడం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాల్లో సమయం కోరడం సరికాదని హితవు పలికింది. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు తోట సురేశ్‌బాబు గతేడాది సెప్టెంబరులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
పరీక్ష ఫలితాల వెల్లడిలో జాప్యం
పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘కరోనా రెండోదశ వ్యాప్తితో రాష్ట్రంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. చేర్చుకోవాలంటేనే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రూ.2-4 లక్షలు తీసుకుంటున్నాయి. బాధితులకు సరిపడ పడకల్లేవు. కరోనా పరీక్ష నివేదికలు రావడానికి 5-7 రోజులు పడుతోంది. ప్రభుత్వం కొంతమేర సంతృప్తికరంగా చర్యలు తీసుకున్నా అవి సరిపోవు’ అన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. అధిక రుసుముల వసూలు కట్టడికి తనిఖీలు చేస్తున్నారా అని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్‌ను ప్రశ్నించింది. ఫలానా ఆసుపత్రి అధిక రుసుములు వసూలు చేస్తోందని తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకొని సీజ్ చేస్తామని ఆయన అన్నారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదులొచ్చినా స్పందిస్తున్నామన్నారు. కరోనా టెస్టులను విస్తృతంగా చేస్తున్నాం’ అని బదులిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫిర్యాదులొచ్చే వరకు వేచిచూడకుండా మీ అంతట మీరే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి: