ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొందరు నకిలీ స్టిక్కర్లు అంటించి కాలం చెల్లిన మందులను కొవిడ్ బాధితులకు అందిస్తున్నారని పేర్కొంటూ.. గుంటూరుకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. విజయనగరం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరిగిందని మణిరత్నం హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీడియో ఆధారాలను లేఖకు జతచేశారు. ఫోన్ సంభాషణలు సైతం తన వద్ద ఉన్నాయన్నారు. ఆ లేఖను పరిశీలించిన పిల్ కమిటీ సభ్యులు జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావులు.. దాన్ని పిల్‌గా పరిగణించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. హైకోర్టు సీజే ఆదేశాల మేరకు రిజిస్ట్రీ ఆ లేఖను సుమోటో పిల్‌గా మలిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, ఔషధ నియంత్రణ అథార్టీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
మతిస్థిమితం కోల్పోయిన వారిని ఆసుపత్రుల్లో చేర్చాలంటూ అందిన లేఖపై...
మతిస్థిమితం కోల్పోయిన వారి విషయంలో మెంటల్ హెల్త్ కేర్(ఎంహెచ్సీ) చట్ట నిబంధనలను సక్రమంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ... విశాఖపట్నం ప్రభుత్వ మానసిక ఆసుపత్రి సైకియాట్రీ ప్రొఫెసర్ డా. రామానంద్ సతాపతి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది. మతిస్థిమితం సక్రమంగా లేక రహదారుల వెంట తిరిగే వారిని మెంటల్ హెల్త్ కేర్ చట్ట ప్రకారం ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన బాధ్యత ఆయా పరిధిలోని పోలీసులపై ఉందని లేఖలో పేర్కొన్నారు.