కొవిడ్ ఉన్న సమయంలో రాష్ట్రంలో పాఠశాలలను తెరవాలని నిర్ణయం తీసుకున్న మేధావులెవరు? సచివాలయంలో కూర్చుని ఉత్తర్వులిస్తే సరిపోతుందా? క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకోరా? విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు టీకాలు పూర్తి కాకుండా పాఠశాలలను తెరవడం ఎలా సముచితం? కొవిడ్ నేపథ్యంలో న్యాయస్థానాల్లోనూ భౌతిక విచారణలను నిర్వహించట్లేదు. అలాంటిది పాఠశాలలను ఎలా తెరుస్తారు?
- హైకోర్టు
కరోనా కాలంలో పాఠశాలలను తెరిచి భౌతికంగా తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయస్థానం ముందు విచారణకు హాజరైన పాఠశాల విద్యాశాఖ, ఇతరశాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించి, మండిపడింది. ‘బడిలో సచివాలయం... అవస్థల పాఠం’ శీర్షికతో ఆగస్టు 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ అధికారులను నిలదీసింది. ఉన్న రెండు గదుల్లో ఒక దాంట్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్వహిస్తుంటే మరో గదిలో 40 మంది పిల్లలు అవస్థలు పడుతున్నారని గుర్తు చేసింది. గ్రామ సచివాలయానికి వచ్చే ప్రజలతో పిల్లలకు కొవిడ్ సోకితే బాధ్యత ఎవరిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఖాళీ చేయించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యల వివరాలతో అదనపు అఫిడవిట్లు వేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఇతర నిర్మాణాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని గతేడాది జూన్‌లో జారీ చేసిన ఆదేశాల్ని అధికారులు పెడచెవిన పెట్టడంతో హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారిస్తోంది.
విచారణకు హాజరైన ఏడుగురు ఐఏఎస్‌లు