గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల బకాయిలను పిటిషనర్లకు రెండు వారాల్లో చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పులు తెచ్చి పనులు చేశారని.. వాటికి వడ్డీ చెల్లించలేక, ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇవ్వలేక గుత్తేదారులు (పిటిషనర్లు) తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంది. అధికారుల చర్యల వల్ల పిటిషనర్లు గౌరవ మర్యాదలతో జీవించే హక్కు ఉల్లంఘనకు గురవుతోందని వ్యాఖ్యానించింది. వారి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందని తెలిపింది. చేసిన పనులకు బిల్లులు పొందే చట్టబద్ధమైన హక్కు పిటిషనర్లకు ఉందని తేల్చిచెప్పింది. బకాయిలు చెల్లించకపోవడానికి కారణాలను కోర్టు ముందు ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.
ఉపాధి హామీ పనుల కోసం తమ వంతుగా ఇవ్వాల్సిన 75% వాటా సొమ్మును ఎప్పటికప్పుడు విడుదల చేశామని, అందులో ఇంకా ఖర్చు చేయని రూ.1,991 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ వేసిన విషయాన్ని గుర్తు చేసింది. కేంద్రం విడుదల చేసిన 75% నిధులకు తమ వాటా 25% సొమ్మును జత చేసి బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు సమర్పించిన బిల్లుల బకాయిలను రెండు వారాల్లో చెల్లించాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం సుమారు 500 వ్యాజ్యాల్లో ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన మెటీరియల్ కాంపోనెంట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో సుమారు 500 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇవన్నీ సోమవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్నారు. పంచాయతీరాజ్‌శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కిరణ్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వాస్తవాల్ని పేర్కొనలేదన్నారు. కేంద్రం చెబుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద సొమ్ము నిల్వ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్సుగా చెల్లించిన సొమ్మును కేంద్రం నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేసుకుందన్నారు. కేంద్ర అఫిడవిట్‌కు పూర్తి వివరాలతో రిప్లై కౌంటర్ వేశామన్నారు. 70 వ్యాజ్యాల్లో ఇప్పటికే సొమ్మును గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేశామన్నారు. అప్పటి పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
బకాయిలు చెల్లించకుండా వాయిదాలేంటి?
ప్రభుత్వ న్యాయవాది వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. బకాయిలు చెల్లించకుండా ఎప్పటికప్పుడు ఏవో కారణాలు చెప్పి వాయిదాలు కోరుతున్నారన్నారు. సొమ్మును పిటిషనర్ల ఖాతాలో జమ చేసినప్పుడే చెల్లింపులు జరిగినట్లు అన్నారు. విజిలెన్స్ విచారణ పేరుతో ఎంతకాలం జాప్యం చేస్తారని నిలదీశారు. ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. కొన్ని చోట్ల పనుల్లో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తెలిసిందన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలకు బకాయిల సొమ్ము జమ చేశామన్నారు. పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు.
ఇదీ చదవండి
CM Jagan: అక్టోబరు 25 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి: సీఎం జగన్