తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసు(Naga Shaurya farm house case) దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్‌ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు. నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇవాళ పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఫామ్‌హౌస్(Naga Shaurya farm house case) రెంటల్ అగ్రిమెంట్లు తీసుకురావాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు గుత్తా సుమన్‌పై ఏపీలో ఉన్న కేసులపై నార్సింగి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇప్పటికే సుమన్‌పై కేసుల వివరాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్లాక్ మెయిల్, ఫోర్జరీ, చీటింగ్ కేసులున్నట్లు పోలీసులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఆసక్తికర మలుపులు
రాజధాని శివారులోని మంచిరేవుల ఫాంహౌస్ వ్యవహారంలో ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య తండ్రి.. నగర శివారుల్లోని మంచిరేవుల ఫాంహౌస్(Naga Shourya farmhouse)ను దాని యజమాని (ఓ మాజీ ఉన్నతాధికారి) నుంచి అయిదేళ్లకు అద్దెకు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మణికొండకు చెందిన గుత్తా సుమన్ కుమార్ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో సుమన్, నాగశౌర్యల మధ్య సంబంధాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు కేసు వివరాలు తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.