Rains: రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. రాగల నాలుగు వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదైందని.. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎగువ నుంచి గోదావరి నదిలోకి మళ్లీ వరద నీరు వచ్చే సూచనలు ఉండటంతో.. గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
ఇంద్రకరణ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్..: ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సీఎం ఫోన్లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్.. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీప్యాడ్లను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.