కుండపోత వర్షానికి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. రోడ్లపై వరద ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
నడుములోతు నీరు
ఎల్బీనగర్ వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధానరహదారిపై నడుము లోతు నీటిలో వాహనదారులు ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటలపాటు రోడ్లపై అనేక అవస్థలు పడ్డారు. వీధుల్లోనూ నడుము లోతు వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై నిలిపిన వాహనాలు మునిగిపోయాయి. వర్షం కారణంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కొట్టుకుపోయిన వాహనాలు
భారీ వర్షానికి మూసీ నాలా పొంగి పొర్లుతుంది. ముసరాంబాగ్ బ్రిడ్జిపై ప్రమాద స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను అలీ కేఫ్ చౌరస్తా నుంచి మళ్లించారు. చైతన్యపురి కమల్‌నగర్‌లో రహదారులు జలమయమయ్యాయి. చైతన్యపురి, శారదానగర్, పీ అండ్ టీ కాలనీ, వీవీ నగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సరూర్‌నగర్ చెరువుకు వరద పోటెత్తింది. చెరువుకు దిగువన లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గడ్డిఅన్నారం, దిల్‌సుఖ్‌నగర్, కోదండరాంనగర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. సరూర్‌నగర్ గ్రీన్‌పార్క్ కాలనీలో నిలిచిఉన్న వాహనాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.