ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన - కోస్తా, రాయలసీమలో జోరు వర్షాలు వార్తలు

రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. పలుచోట్ల పొలాల్లో నీరు నిలిచింది.

ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన
ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన

By

Published : Sep 26, 2020, 5:59 AM IST

ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు గరిష్ఠంగా.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కనుమోలులో 125 మి.మీ. వర్షం కురిసింది. హనుమాన్‌జంక్షన్‌, గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం ప్రాంతాల్లో 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు, కడప జిల్లా పెండ్లిమర్రి, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలోనూ భారీ వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
*గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం రాచపాళెంలో 116 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి.
*కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాయంత్రం నుంచి మబ్బులు పట్టాయి. కడపలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మేడికొండూరు, ఫిరంగిపురం, మంగళగిరి, వట్టిచెరుకూరు, భట్టిప్రోలు, నిజాంపట్నం, కొల్లిపర, ప్రత్తిపాడు, బాపట్ల, అమృతలూరు, మాచవరం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.
*దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వారం క్రితం కుండపోత వానలు కురిశాయి. పంట నష్టం అంచనాలు పూర్తికాలేదు. మళ్లీ జోరుగా వానలు పడటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంటలు చేతికి అందవేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేడు, రేపు వానలు
శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. ఉత్తరకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని వివరించారు.

ఇదీ చదవండి:తిరిగిరాని లోకాలకు బాలు.. శోకసంద్రంలో ప్రజానీకం

ABOUT THE AUTHOR

...view details