ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hyderabad Rain: హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాన రావడంతో వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

heavy rains in hyderabad
హైదరాబాద్​లో భారీ వర్షం

By

Published : Jul 17, 2021, 9:36 PM IST

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వాన వల్ల వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని సికింద్రాబాద్​, ప్యారడైజ్, ప్యాట్నీ, రైల్వే స్టేషన్, చిలకలగూడ, బోయిన్​పల్లి, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. కోఠి, హబ్సిగూడ, నాచారం, బీఎన్‌రెడ్డినగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్‌, కూకట్‌పల్లి, అల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. కర్మన్​ఘాట్, పాతబస్తీ, సైదాబాద్, అబ్దుల్లాపూర్​మెట్​ తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.

భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

నైరుతి రుతు పవన ద్రోణి అక్షం హిమాలయ పర్వత శ్రేణికి చేరువగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఒకటి కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల మధ్యలో ఏర్పడిందని వెల్లడించింది. తూర్పు-పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ వైపు వంపు తిరిగి ఉందని తెలిపింది.

ఇదీ చూడండి:Ramakrisha: 'పంతానికి పోయి రాష్ట్రాల అధికారాలను కేంద్రానికి అప్పగిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details