కృష్ణా నదికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాతో... 9 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణాజిల్లా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలపై వరద ప్రభావం ఉంటుందనే అంచనాతో... కలెక్టర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపొర, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో వరద కొనసాగుతోంది. 11 లంక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పోతర్లంక-దోనేపూడి మధ్య వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పడవులు ఏర్పాటు చేయకపోవడం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరద రైతుల పాలిట శాపంగా మారింది. పసుపు, మిరప, కంద, అరటి పంటలు నీట మునిగాయి. నీటమునిగిన పంటను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని గని అత్కూరు, చెవిటికల్లు మున్నలూరు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. చందర్లపాడు మండలంలో పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. కృష్ణాతీరం వెంట ఉన్న గ్రామాల్లో ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీతీరం వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు, గజ ఈతగాళ్లు, రెవిన్యూ సిబ్బందిని గ్రామాల వద్ద కాపలా ఉంచారు. వరద తగ్గుముఖం పట్టేవరకూ అప్రమత్తంగా ఉంటామని అధికారులు తెలిపారు.