ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC: రుణ ఒప్పందాల్లో.. గవర్నర్ పేరును ఎలా చేరుస్తారు..?: హైకోర్టు - ఏపీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రుణాలపై హైకోర్టులో విచారణ వార్తలు

టాక్స్‌ నిధులను న్యాయస్థానం ముందుంచండి
టాక్స్‌ నిధులను న్యాయస్థానం ముందుంచండి

By

Published : Oct 21, 2021, 2:04 PM IST

Updated : Oct 22, 2021, 5:18 AM IST

14:03 October 21

ఏపీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రుణాలపై హైకోర్టులో విచారణ

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు, రుణాల వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీఎస్​డీసీ(APSDC) ద్వారా బ్యాంకుల నుంచి 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో... గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ పేరును ఎలా చేరుస్తారని ప్రశ్నించింది. గవర్నర్‌ పేరుతో చేసుకున్న ఇలాంటి ఒప్పందం చెల్లకుండా పోయే అవకాశం ఉందని ధర్మాసనం(high court on apsdc) పేర్కొంది. దావాలు, క్రిమినల్‌ కేసుల నమోదు నుంచి అధికరణ 361 ప్రకారం గవర్నర్‌కు రక్షణ ఉందని గుర్తుచేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌కు ఉన్న సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదంది. పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని.. కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎస్​డీసీకి మళ్లించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంచేసింది. నిధుల బదిలీకి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఏపీఎస్​డీసీ ఏర్పాటు, రుణాల సేకరణపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. 


పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బాలాజీ వడేరా, బి.నళిన్‌ కుమార్‌, గూడపాటి వెంకటేశ్వరరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్​డీసీ(apsdc) ద్వారా ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయల రుణం పొందిందన్నారు. రుణం కోసం విశాఖ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టినట్లు వివరించారు. బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో గవర్నర్‌ పేరును వ్యక్తిగతంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. ఈ చర్య ద్వారా గవర్నర్‌కు ఉన్న సార్వభౌమాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వదులుకుందని.. రుణం తీర్చేందుకు హామీదారుగా పేర్కొంజని తెలిపారు.

 ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. పన్నుల ఆదాయాన్ని మొదట కన్సాలిడేటెడ్ ఫండ్‌లోనే జమ చేస్తున్నామని చెప్పారు. రికార్డులను కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధమన్నారు. రాజకీయ కారణాలతోనే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారని కోర్టుకు నివేదించారు. రాజకీయ నాయకులు దాఖలుచేసే ప్రజాహిత వ్యాజ్యాలను నిలువరించలేమని, ఏ పార్టీ నేతలు పిటిషన్లు వేశారనే అంశంతో తమకు సంబంధం లేదని హైకోర్టు స్పష్టంచేసింది. కేవలం వ్యాజ్యాల్లోని అంశాలను పరిగణనలోనికి తీసుకుని విచారణ చేస్తామని చెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి

Changes in Lessons: సీబీఎస్​ఈ తరహాలో పాఠ్యాంశాలు... ఎప్పటినుంచి అంటే..!

Last Updated : Oct 22, 2021, 5:18 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details