కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న అవగాహనను కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్లను బలవంతంగా తీసుకెళ్లి మరీ.. టీకాలు ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఫోకస్..
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని పోచంపల్లిలో ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లు గ్రామాల్లో ఎంత అవగాహన ఇచ్చినప్పటికీ... కొంతమందికి కరోనా వ్యాక్సినేషన్ పట్ల ఉన్న అపోహలతో టీకా వేసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. అయినా పట్టువదలని ఏఎన్ఎమ్, ఆశ వర్కర్లు.. గ్రామంలో ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామస్థులపై ఆరోగ్య కార్యకర్తలు దృష్టి పెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ... ఎవరెవరు ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోలేదని ఆరా తీసి.. పేర్లు నమోదు చేసుకుని వారిపై ఫోకస్ పెట్టారు.
తీసుకోనంటే తీసుకోనని..
వ్యాక్సిన్ వేసుకోని వారు ఇళ్లల్లో, వీధుల్లో.. ఎక్కడ ఉన్నా వదిలిపెట్టట్లేదు. దగ్గరుండి మరీ తీసుకెళ్లి టీకా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఓ వ్యక్తి ఇప్పటికీ టీకా తీసుకోలేదు. అతడికి ఎదురుపడి.. వ్యాక్సిన్ వేసుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు వివరించారు. అంతా విన్న ఆ వ్యక్తి.. తీసుకోనని పట్టుబట్టాడు. ఆరోగ్య కార్యకర్తలతో పాటు పలువురు స్థానికులు కూడా అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. మొండి పట్టు పట్టాడు. వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వివరించినా.. అర్థం చేసుకోకుండా తీసుకోనంటే తీసుకోనని మొండికేశాడు.