నేటి నుంచి 18-45 మధ్య వయసున్నవారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించటం లేదని... రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇచ్చే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ... ప్రధానికి సీఎం జగన్ లేఖ రాస్తున్నారని చెప్పారు. 18-45 మధ్య వయస్సు వారికి 4.08 కోట్ల టీకా డోసులు అవసరముందన్నారు. మే నెలలో 9,90,700 కొవిషీల్డ్, 3,43,930 కొవాగ్జిన్ డోసుల కొనుగోళ్లకు అవకాశం ఉందన్నారు.
ఆక్సిజన్ సరఫరా పెంచాలని కోరాం..
ప్రస్తుతం రాష్ట్రానికి 470 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని సింఘాల్ వివరించారు. దీన్ని 550 టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. రాష్ట్రంలో రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయన్న సింఘాల్... క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కొవిడ్ కేర్ సెంటర్ల సంఖ్య పెంచుతాం..
రాష్ట్రవ్యాప్తంగా 30,559 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని సింఘాల్ వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 17,241 రెమిడెసివిర్ డోసులు ఇచ్చామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నామని.. మరో రెండు మూడు రోజుల్లో కేర్ సెంటర్ల సంఖ్య 15 వేలకు చేరవచ్చన్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లలో 7,749 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి...
రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 17,354 కేసులు, 64 మరణాలు