ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 104 కాల్ సెంటర్‌ను వినియోగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు తెలిపారు. 104 కాల్ సెంటర్‌ను ఈ వారంలో బలోపేతం చేస్తామన్నారు. సిబ్బంది తీరు, ఆరోగ్య శ్రీ సేవల్లో అలసత్వం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి వాటిపై 104కు ఫిర్యాదు చేయవొచ్చన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెనువెంటనే ఆరా తీసి చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఫీవర్ సర్వేను తేలిగ్గా తీసుకోవద్దని కలెక్టర్లకు కృష్ణ బాబు ఆదేశించారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషనరీ డోస్‌ను వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాన్ని చేరుకునేలా స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టాలన్నారు. జిల్లాల్లో క్యాడర్ వారీగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రతినెలా శిక్షణ ఇవ్వాలని.. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌తో మరణించిన వారికి పరిహారం చెల్లించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల పునర్విభజన అనంతరం ఎన్హెచ్ఎం సిబ్బంది సర్దుబాటు, ఆస్పత్రుల్లో ఫైర్‌సేఫ్టీ ఆడిట్, ఎన్వోసీ తదితర అంశాలపై సమీక్షించాలన్నారు. ఫైర్ సేఫ్టీ ఆడిట్‌కు సంబంధించి అన్ని ఆస్పత్రుల మాస్టర్ డేటా అప్‌లోడ్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు.