ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో కుట్రకోణం ఉంటే తేల్చండి' - CBI take case on Social media coments over judges

న్యాయమూర్తులపై సోషల్ మీడియా వ్యాఖ్యల కేసు
న్యాయమూర్తులపై సోషల్ మీడియా వ్యాఖ్యల కేసు

By

Published : Oct 12, 2020, 2:53 PM IST

Updated : Oct 13, 2020, 4:54 AM IST

14:49 October 12

న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసు సీబీఐకి అప్పగింత

        న్యాయవ్యవస్థపై దాడి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? లేదా ? తేల్చాలని....హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ - సీబీఐని ఆదేశించింది. కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లను సీబీఐ డైరెక్టర్‌కు అప్పగించాలని, వాటి ఆధారంగా తక్షణం చర్యలు చేపట్టి చట్టప్రకారం ముందుకెళ్లాలని తెలిపింది. తాజాగా అనుబంధ పిటిషన్‌లో....స్పీకర్‌, ఉపముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు చేసిన వ్యాఖ్యల వివరాల్ని సీబీఐకి అందజేయాలని వాటిని పరిశీలించి తీవ్ర నేరాలకు పాల్పడ్డట్టు తేలితే మరికొన్ని ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసి దర్యాప్తును తార్కిక ముగింపునకు తీసుకురావాలంది. కుట్ర ఉన్నట్లు గమనిస్తే... హోదా, స్థాయితో నిమిత్తం లేకుండా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది.

       దర్యాప్తును ప్రారంభించిన వెంటనే ఆయా పోస్టులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని... చట్ట ప్రకారం సంబంధిత యూజర్లను బ్లాక్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలంది. దిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌కు కోర్టు ఉత్తర్వులను తక్షణం తెలియజేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న నాటి నుంచి 8 వారాల్లో దర్యాప్తుపై నివేదికను సీల్డ్‌ కవర్‌లో తమకు సమర్పించాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టింగ్‌లపై...హైకోర్టు అప్పటి ఇంఛార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టకుండా స్వీయ నియంత్రణ పాటించేలా ఆయా సామాజిక మాధ్యమ కంపెనీలను ఆదేశించాలని కోరారు. తాజాగా హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిన రిజిస్ట్రార్‌ జనరల్‌.....స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తదితరులు.....న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యల వివరాల్ని కోర్టు ముందు ఉంచారు. ఇరువైపుల వాదనలు ఆలకించిన కోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.


         విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం పార్ట్‌ - 3లో పౌరులకు కల్పించిన హక్కుల్ని కాపాడే బాధ్యతతో.... హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, మరికొందరు పిటిషనర్లు కోర్టు ముందుకు వచ్చారని స్పష్టం చేసింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో హైకోర్టు, న్యాయమూర్తులను దూషిస్తూ..... ఏప్రిల్‌ 2020 నుంచి రాష్ట్రంలో కొత్త ధోరణి మొదలైనట్లు కోర్టు దృష్టిలో ఉందన్న న్యాయ స్థానం..... ఉన్నత స్థాయిలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొంత మంది సైతం స్వీయనియంత్రణ పాటించలేదని వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్‌ మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇచ్చారని తెలిపింది. న్యాయమూర్తులను దూషించినా, అవమానించినా వారి నిష్పాక్షికత, విధేయత, చిత్తశుద్ధి గురించి చెప్పుకునే వేదిక లేదనే విషయం అందరికి తెలిసిందేనన్న కోర్టు.....న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్నవాళ్లు కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా అవమానించినా కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టొచ్చని తెలిపింది. ప్రస్తుత కేసులో దోషులను శిక్షించేందుకు కోర్టు ధిక్కరణ చట్టం సరిపోదని అభిప్రాయపడింది. ఏపీలో సాధారణ ప్రజలు క్రమశిక్షణ కలిగి ఉంటారు... చట్టాల్ని గౌరవిస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తీర్పులో తెలిపింది. వారికి వ్యవస్థపై నమ్మకం ఉందని.... అయినప్పటికీ పిటిషనర్‌పై సామాజిక మాధ్యమాల ద్వారా అపకీర్తి తెచ్చేందుకు ఓ పథకం ప్రకారం దాడి జరుగుతున్నట్లు కనబడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని అసాంఘికశక్తుల దాడి నుంచి న్యాయవ్యవస్థను కాపాడటానికి హైకోర్టు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకొని ఈ వ్యాజ్యం దాఖలు చేసిందని తీర్పులో పేర్కొంది. 

సీబీఐ కోరినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి, డీజీపీ ద్వారా పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది.

ఇదీచదవండి

రాజధాని ప్రధాన పిటిషన్లపై దసరా తర్వాత విచారణ

Last Updated : Oct 13, 2020, 4:54 AM IST

ABOUT THE AUTHOR

...view details