బెజవాడలో హవాలా దందా...నగదు రవాణాకు కొత్త పంథా విజయవాడ కేంద్రంగా హవాలా దందా జోరుగా సాగుతోంది. కోట్ల రూపాయల నగదు చేతులు మారుతుంది. హవాలా మార్గంలో రవాణా జరుగుతున్న రూ.కోటి 40 లక్షల నగదు, 30 వేల డాలర్లను నెల రోజుల కిందట టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు కారులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వెనుక భాగంలో ప్రత్యేక అరలు ఏర్పాటుచేసి నగదు అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించారు. కోడ్ భాషలో ఈ వ్యాపారం కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. సగం ముక్క ఉన్న నోటును తీసుకుని ఓ షాపుకు వెళ్తే .. నోటుపై ఉన్న నెంబరును.. కోడ్‌గా చెప్పి తన వద్ద ఉన్న సగం నోటును ఎదుటి వ్యక్తికి ఇస్తారని.. ఎదుటి వ్యక్తి తన వద్ద ఉన్న మిగిలిన సగం నోటుతో జత చేసి చూసి.. నగదు ఇస్తాడని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టేందుకు కొంతమంది హవాలా మార్గాన్ని ఎంచుకుంటారు. విజయవాడ నుంచి ముంబయికి వెళ్లి ఏదైనా కొనుగోలు చేయాలంటే నగదు తీసుకోకుండా వెళ్తారు . అక్కడ తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత వేరే వ్యక్తి ద్వారా హవాలా మార్గంలో ముంబయి వ్యక్తికి నగదును ఇస్తారు. కమీషన్ రూపంలో ఈ దందా కొనసాగుతుందని పోలీసులు చెపుతున్నారు. విజయవాడలో వన్‌టౌన్, గవర్నర్ పేట్ పీఎస్ పరిధిలో హవాలా వ్యాపారం సాగుతుందని గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
హవాలా మార్గంలో నగదుతో పాటు బంగారు ఆభరణాల వ్యాపారం విజయవాడలో కొనసాగుతుంది. దీనినే జీరో బిజినెస్ అంటారు. ముంబయి నుంచి నగరానికి కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకువస్తారు. ఇక్కడ హోల్ సేల్ వ్యాపారులకు విక్రయించిన తర్వాత నగదును హవాలా మార్గంలో తీసుకుంటారు. దీంతో ఆభరణాలకు చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తారు. గతేడాది కొరియర్ మార్గంలో రూ.88 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ముంబయి నుంచి నగరానికి పంపిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను గతంలో అరెస్ట్ చేశారు. మరికొన్ని ముఠాలు కోడ్ భాషలో హవాలా దందా కొనసాగిస్తున్నారు. కాళేశ్వర మార్కెట్ హాల్ సేల్ దుకాణంలో 30 కేజీల మిర్చికావాలి అంటాడు ఓ వినియోగదారుడు ..వెంటనే షాపు యజమాని రూ.30 లక్షల రూపాయలు ఇస్తాడు. ఈ రకంగా కోడ్ భాషలో హవాలా వ్యాపారం జరుగుతున్న వైనం గతేడాది విజయవాడలో బయటపడింది.
జీరో బిజినెస్, హవాలా వ్యాపారంపై నిరంతరం నిఘా ఉంచామని టాస్క్ ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిఘా పెట్టినప్పటికీ నిందితులు అడ్డదారుల్లో హవాలా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నిందితులపై బలమైన కేసులు లేకపోవటం...కమీషన్లు రావటమే హవాలా దందా కొనసాగటానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :'ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి'... కేంద్ర మంత్రికి సీఎం జగన్ లేఖ