కళింగపట్నం వద్ద తీరాన్ని దాడిన గులాబ్ తుపాను (Gulab Cyclone) తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణశాఖ (IMD) స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణాలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలియచేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. గడచిన 6 గంటలుగా ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సెప్టెంబరు 30 నాటికి మహారాష్ట్ర-గుజరాత్‌కు సమీపంలో అరేబియా సముద్రంలోకి ప్రవేశించి మళ్లీ బలపడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
విస్తారంగా వర్షాలు
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. అలాగే కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా-ఒడిశా తీర ప్రాంతాల్లో సముద్రం ఇంకా అలజడిగానే ఉంది. విశాఖ, గజపతినగరం, నెల్లిమర్లలో అత్యధికంగా 28 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది.
అధికారులతో సీఎం సమీక్ష
గులాబ్ తుపాను (Gulab Cyclone) అనంతర పరిస్థితులపై..ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష (cm jagan video conference on cyclone) నిర్వహించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై చర్చించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తుపాను అనంతర పరిస్థితులను వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రతిపాదికన విద్యుత్ పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తుపాను అనంతరం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచించారు.