ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 5, 2021, 11:59 AM IST

ETV Bharat / city

పంచుకుంటున్నారా.. తెంచుకుంటున్నారా!?

ఇద్దరి మధ్య మూడో వ్యక్తి చొరవ వల్లనో... కుటుంబ సభ్యుల ఆధిపత్యం వల్లనో గతంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవి. కానీ నేటి రోజుల్లో ఇద్దరి మధ్య మూడో వ్యక్తిగా చేరిన స్మార్ట్​ ఫోన్​.. తెలియకుండానే ఎన్నో అవాంతరాలను తెచ్చిపెడుతోంది. ఒక్క పోస్టుతోనే మీ బంధానికి తూట్లు పొడుస్తోంది.

పంచుకుంటున్నారా.. తెంచుకుంటున్నారా!?
పంచుకుంటున్నారా.. తెంచుకుంటున్నారా!?

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. అందులో డేటా ఉంటే చాలు.. తమకు నచ్చిన, నచ్చని అంశాలను క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఫలితం ఎలా ఉండబోతుందనేది ఆలోచించకుండానే పోస్టు పెట్టేస్తున్నారు. అవి కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. ఆత్మీయుల మధ్య వైరాన్ని పెంచుతున్నాయి. బంధుత్వాలను దూరం చేస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసేంత వరకూ వెళ్తున్నాయి. కాపురాలను కూల్చివేస్తున్నాయి. వధూవరులు పెళ్లిపీటలు ఎక్కక ముందుగానే ఒకరిపై ఒకరికి అనుమానం పెరిగేందుకు కారణమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం.. సామాజిక మాధ్యమాలు అధికంగా ఉపయోగించే మహానగరంలో ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయని మనస్తత్వ విశ్లేషకురాలు డాక్టర్‌ అనిత అరె తెలిపారు.

కొంప ముంచే అత్యుత్సాహం

వాట్సాప్‌ గ్రూపులు.. ఫేస్‌బుక్‌ ఖాతాలు.. ట్విటర్‌లు.. సమాచారం ఇచ్చిపుచ్చుకునేంత వరకూ బాగానే ఉంటుంది. అనవసరమైన అంశాలను పంచుకోవటంలో అత్యుత్సాహం చూపటం వల్లే అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. కొందరైతే తమకు వచ్చిన సందేశాలు, చిత్రాలను చూడకుండానే ఇతర గ్రూపులకు చేరవేస్తుంటారు. వాటిలో ఏదైనా పొరపాటు ఉందని గ్రహించే లోపుగానే బాధితులకు జరగరాని నష్టం జరుగుతోందని సీఐ రాజు తెలిపారు. వదంతులను వ్యాప్తి చేస్తున్నామనే అవగాహన చాలామందిలో లేదంటూ ఆందోళన వెలిబుచ్చారు.

* కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందనేది చూశాం. మహమ్మారి బాధితుల్లో కొందరు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్న మందులు, సూచనలు పాటిస్తూ ఊపిరాడని పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన వారున్నారంటూ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జ్వరం, జలుబు చేసినా భయపడి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగిన వారున్నారని విశ్లేషించారు. నగరంలో చేసిన వైద్యపరీక్షల్లో వ్యాధి నిర్ధారించలేకపోయారనే ఆందోళనతో మరో ప్రాంతంలో పరీక్షలు చేయించుకున్న వ్యక్తులూ ఉన్నారంటూ సైకాలజిస్టు అనిత తెలిపారు. అనవసరమైన అంశాల వ్యాప్తి ప్రజల్లో భయాందోళనను గురిచేస్తోందని పేర్కొన్నారు.

వదంతులు.. అపార్థాలు

* కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే 20 కుటుంబాలతో ఓ వాట్సాప్‌ గ్రూపు ఏర్పడింది. ఓ కుటుంబంలో యువతిపై మొదలైన చర్చ క్రమంగా గొడవకు దారితీసింది. అప్పటి వరకూ ఆత్మీయంగా మెలిగే వారిలో కలతలకు కారణమైంది. పెద్దల జోక్యంతో సమసినా గతంలో ఉన్నంత స్నేహంగా ఉండలేకపోతున్నామంటూ అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే ఐటీ ఉద్యోగి ఒకరు తెలిపారు.

* నగర శివార్లలోని యువతికి గుంటూరు జిల్లాకు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. పరస్పరం సమాచారం పంచుకున్నారు. ఆ యువతి..కొందరు యువకులతో దిగిన ఫొటోను సామాజిక ఖాతాల్లో గమనించిన అతడు ప్రశ్నించాడు. పెళ్లి రద్దు చేసుకునేంత వరకూ దారితీసింది.

ప్రతికూల అంశాలను అందరితో పంచుకోవాలనే ఆతృత సమస్యకు కారణమవుతోందని మనస్తత్వ విశ్లేషకురాలు అనిత తెలిపారు. ఇటువంటి వాటిని వదిలేయటమే కాకుండా, సామాజిక ఖాతాల్లోని గ్రూపుల నుంచి బయటపడాలని సూచించారు. ఏదైనా విషయాన్ని ఇతరులకు పంపేటపుడు ఒకటికి పదిసార్లు నిర్ధారించుకున్నాకే పంపాలో లేదో నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:

ఎంత ఎత్తున్నా సులువుగా ఎక్కేస్తాడు 'కోతిరాజ్'​

ABOUT THE AUTHOR

...view details