ఈనెల 14 నుంచి జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు విజయవాడలో ఆందోళన కొనసాగించారు. ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రంలో చాలా తప్పులు దొర్లాయని.. ఏపీపీఎస్సీ నిర్వాకం వల్ల అనేకమంది మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోయారని ఆరోపించారు. హైకోర్టు తీర్పుతో 1,300 మందికి పైగా అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు రాసేందుకు అవకాశం వచ్చిందని తెలిపారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు 45 రోజులు మాత్రమే గడువు దొరికిందని వాపోయారు.
గతంలో మెయిన్స్ పరీక్షలకు 400 రోజుల సమయం ఉండేది కాగా.. ఇప్పుడు సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సబ్జెక్టు చదవలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థుల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. కరోనా వల్ల ఎన్నికలు జరిపేందుకు వెనకాడుతున్న సర్కారు.. గ్రూప్-1 మెయిన్స్ ఎలా నిర్వహిస్తుందని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర ప్రశ్నించారు. ఓ వైపు కొవిడ్.. మరో వైపు సమయాభావం వల్ల ఏమి చేయాలో తెలియని స్థితిలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.