ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KARTHIKA POURNAMI : ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు...ఆలయాల్లో భక్తుల రద్దీ - grandly celebrations of karthika pournami festival

రాష్ట్రవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి(Karthika pournami celebratiions) వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే ఆలయాలకు తరలివచ్చిన మహిళలు, భక్తులు దీపాలు వెలిగించి, పూజలు చేశారు. భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయాలు పండుగశోభను సంతరించుకున్నాయి.

ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు

By

Published : Nov 19, 2021, 7:33 AM IST

ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం(Srikalahasthi)లో ఘనంగా బాల దీపం ఉత్సవాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట(Achanta)లోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన రామేశ్వరం ఆలయంలో అఖండ జ్యోతి ప్రజ్వలన వైభవంగా నిర్వహించారు. స్థానిక గొడవర్తి కుటుంబీకుల ఆధ్వర్యంలో కృత్తిక నక్షత్ర హోమం నిర్వహించి జ్యోతిని వెలిగించారు. విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్తీకమాసంలో ముఖ్యమైన జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్విహంచారు.

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి(Vadapalli) వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం(Mantralayam Raghavendra swamy Temple)లో కార్తిక మాసం సందర్భంగా పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా జ్వాలాతోరణం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను పురవీధుల్లో ఊరేగించారు.

కార్తిక పౌర్ణమి విశిష్టత...

మాసాల పేర్లకు ఒక ప్రత్యేకత ఉంది. పౌర్ణమితో కలిసిన నక్షత్రమే మాసానికి పేరు అవుతుంది. కృత్తిక నక్షత్రం కలిసిన పౌర్ణమి- కార్తిక పౌర్ణమి. శివుడు పంచభూతాత్మక స్వరూపుడు. ఆయా భూతాల అధినాథుడిగా ఆయన వివిధ క్షేత్రాల్లో పూజలందుకుంటున్నాడు. కాశీలో విశ్వేశ్వరుడిగా, శ్రీశైలంలో మల్లికార్జునుడిగా... పేర్లు వేరయినా- అన్నింటా శివుడే. శివుడు కాలాతీతుడు. కాశీలో మరణించిన వారికి శివుడు మోక్ష మంత్రాన్ని అనుగ్రహిస్తాడనే నమ్మకం ఉంది. శ్రీ రామకృష్ణ పరమహంస ఆ దృశ్యాన్ని చూసినట్టు చెబుతారు. కార్తిక పౌర్ణమి రోజునే సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ దేవ్‌ జన్మించారు. జైనులు ఇదే రోజున ఆదినాథ ప్రభువు దర్శనం కోసం వెళతారు. ఈ మాసం హిందువులకు చాలా పవిత్రమైనది. దీపావళి ఈ మాసంలోనే వస్తుంది. శరీర శక్తిని పెంచుకునేందుకు ఈ మాసంలో ఉపోషాలు చేస్తారు. వివాహాలు చెయ్యరు. కార్తిక మాసం శివ, విష్ణువులిద్దరికీ ప్రీతికరమైంది. కాబట్టి ఇద్దరినీ సేవిస్తారు. కార్తిక పూర్ణిమనే త్రిపురి లేక త్రిపురారి పూర్ణిమ అంటారు. దీన్ని దేవ దీపావళి అనీ అంటారు.

శక్తి కలిగిన భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు. లేనివారు చంద్రదర్శనం తరవాత, పూజలు చేసి, భోజనం చేస్తారు. దీనినే పూర్ణిమ వ్రతం అంటారు. కార్తిక పూర్ణిమ రోజున తులసీ వివాహం చేస్తారు. ఈ రోజున ఉల్లిపాయలు తినరు. పళ్లు, పాలు, తేలిక సాత్విక ఆహారాలే తీసుకుంటారు. స్త్రీలు తమ సోదరుల క్షేమం, అభివృద్ధి ఆకాంక్షిస్తూ పూజలు చేస్తారు. కేరళ, తమిళనాడు, శ్రీలంకల్లో పూజలు భగవతి అనుగ్రహం కోసం చేస్తారు. హైందవ సంప్రదాయంలోని వార్షిక ఉత్సవాలన్నీ భక్తులకు భగవంతుడి అనుగ్రహానికి అర్హతలు కలిగిస్తాయి. అజ్ఞానమనే తిమిరానికి జ్ఞానం అనే జ్యోతి వెలుగులిచ్చి మనసులను ఆనందమయం చేస్తుంది. కార్తిక మాసంలో దీపాల పండుగ జరపడం శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమని చెబుతారు. భక్తులందరూ పరమాత్మకు దీపాలతో పూజలు చేయడం కార్తిక మాస ప్రత్యేకత. కార్తికమాసాన్ని పురుషోత్తమ మాసం అనీ అంటారు. శివకేశవులనిద్దరినీ ఆరాధించడం ఈ మాసంలోని ప్రత్యేకత. ఇద్దరూ కలిసి ఉండటం ఈ మాసంలో జరుగుతుంది. ఈ మాసంలో నిత్యమూ విష్ణు సహస్రనామ పారాయణం శివప్రీతిగా సోమవారాలు, కార్తిక ఏకాదశి, కార్తికపౌర్ణమి రోజుల్లో, ఉపవాసంతోపాటు దీపారాధనలు చేస్తారు.

ఆత్మజ్ఞానానికి దీపారాధన

దీపారాధన ద్వారా మనలోని అజ్ఞానం, అహంకారం, ఆగ్రహం, స్వార్థం, అసూయ, ద్వేషం వంటి ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయని నమ్ముతారు. కార్తిక దీపారాధన ద్వారా మన ఆత్మ చెడు కర్మలనుంచి శుద్ధి చెందుతుంది. పరమాత్మతో అనుబంధాన్ని కలిగిస్తుంది. ఆత్మజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. కార్తికమాసంలో శివపురాణ పఠనం చేస్తారు. దానాలు చేస్తారు. ‘నమశివాయ’ అనే ధ్యానం మన ఆత్మలను పవిత్రం చేస్తుంది. కార్తికమాసం పవిత్రత, ధ్యానాలకు ఎంతో ముఖ్యమైంది. శివకేశవుల ఇద్దరి అనుగ్రహానికి ఈ మాసంలోని ఆరాధనలు ఎంతో ఉపకరిస్తాయి. కార్తిక పౌర్ణమినాడు రోజుకొక్కటిగా మూడువందల అరవై అయిదు వత్తులను వెలిగించి, శివుడి ఎదుట ఉంచుతారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details