పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్‌కు అధికారులపై చర్యలు తీసుకునే పరిధి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కేడర్‌లో పని చేసే అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఎస్‌ఈసీ సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ఎస్‌ఈసీ తాజా వార్తలు
16:50 January 27
నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ సిఫార్సు మాత్రమే చేయగలదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోకి చొచ్చుకొని రావడమేనని, ఇది చట్ట పరమైన తప్పిదమని పేర్కొంది. నిర్దేశిత నిబంధనలను పాటించకుండా జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని, సిబ్బందిని, వనరులను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమకూర్చాలని హైకోర్టు ఆదేశించినా ద్వివేది, గిరిజా శంకర్ పెడచెవిన పెట్టారని, ఎంత మాత్రం సహకరించలేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్న విషయం తెలిసిందే. 2021 ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో వాళ్ల నిర్లక్ష్యంవల్ల ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 3.62 లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోతున్నారని తెలిపారు. వారిద్దరి సారథ్యంలోని పంచాయతీరాజ్‌శాఖ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఘోరంగా విఫలమయ్యాయని రమేశ్ కుమార్ మండిపడ్డారు. వారిద్దరూ కావాలని, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని, తమ బాధ్యతను విస్మరించారని తెలిపారు. ఇదేదో సాధారణ పొరపాటు కాదని, క్షమించరాని తప్పిదమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఇళ్ల స్థలాల కేటాయింపు, పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్