రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికిగానూ ఈ బదిలీల వర్తింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఆన్ లైన్ ద్వారా బదిలీ దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం... వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ దరఖాస్తులను స్వీకరించి బదిలీలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, బదిలీలకు సంబంధించి గ్రేడ్ పాయింట్ల అంశాల షెడ్యూల్ను విడుదల చేస్తారని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్లు, గ్రేడ్ 2 గెజిటెడ్, స్కూలు అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం.