రాష్ట్రంలో భూముల ఆటోమ్యుటేషన్ విధానాన్ని రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్ తెలిపారు. పట్టాదారు ఎవరికైనా భూమి అమ్మితే.. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూ యజమానుల పేర్లు మారిపోతాయని వివరించారు. రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరుతో భూమి ఉందో వారే వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే ఎలాంటి విచారణ అవసరం లేకుండానే కొనుగోలు చేసిన వారి పేరుతో మార్చేస్తామన్నారు. ఈ విధానం అమలుకు సీఎం నుంచి అనుమతి తీసుకున్నామని.. సాప్ట్‌వేర్ తయారు చేస్తున్నామన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రీసర్వే కార్యక్రమ అమలు, చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం, ధ్రువీకరణ పత్రాల జారీలో మార్పుల గురించి వివరించారు. రీసర్వే అయ్యే వరకు గ్రామాల్లో సర్వే చేయొద్దని, దరఖాస్తులు ఆమోదించొద్దనే ఆదేశాలేవీ ఇవ్వలేదని వివరించారు. సర్వర్ పనిచేయడం లేదనో, తాము దరఖాస్తులు తీసుకోవడం లేదనో గ్రామ సచివాలయాల్లో చెబితే క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణిస్తామని హెచ్చరించారు. సర్వేశాఖ కమిషనర్ సిద్దార్ధ జైన్, సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు ఎ, జాయింట్ సెక్రటరీ (ల్యాండ్స్) గణేశ్ కుమార్‌తో కలిసి పలు అంశాలపై ఆయన మాట్లాడారు..
సర్వే, సబ్‌డివిజన్ తర్వాతే..
ఒక సర్వే నంబర్లో ఒకరికి చెందిన కొంత భూమిని.. ఎక్కువమందికి అమ్మినప్పుడు ప్రస్తుతం పార్ట్ అని రాస్తున్నారు. దీంతో ఎవరికెంత అమ్మారు? హద్దులేంటనే విషయాల్లో తేడాలొస్తున్నాయి. ఇకపై ఒక సర్వే నంబర్లో కొంత భూమిని అమ్మిన తర్వాత.. తప్పనిసరిగా సర్వే, సబ్ డివిజన్ చేయించుకోవాల్సిందే. అప్పుడే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తారు.
తిరస్కరించే అధికారం ఆర్డీవోకే
చిన్నచిన్న కారణాలతో మ్యుటేషన్లను తిరస్కరిస్తున్నారు. ఇకపై మ్యుటేషన్ దస్త్రం గ్రామ సచివాలయం నుంచి వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్లకు వెళ్తుంది. సరే అంటే అక్కడితో పూర్తవుతుంది. కాదనే పరిస్థితి ఉంటే ఆర్డీవోకు పంపిస్తారు. ఆర్డీవో అనుమతి లేకుండా తిరస్కరించే అవకాశం లేదు.
విచారణ లేకుండా ధ్రువీకరణపత్రాలు
*దరఖాస్తు చేసిన వ్యక్తికి, అతని తండ్రికి గతంలో కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఉంటే.. దాని ఆధారంగానే ప్రస్తుత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని గ్రామ సచివాలయంలోనే ఇస్తారు. విచారణ అవసరం ఉండదు.
*గ్రామాల్లో ఏడాదికి రూ. 1.20 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి బియ్యం కార్డు ఇస్తారు. రేషన్ కార్డు ఆధారంగా గ్రామ సచివాలయంలోనే ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు.
టెన్త్ మార్కుల జాబితానే ప్రాతిపదిక
దరఖాస్తుతోపాటు తమ పదో తరగతి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తే.. దాని ఆధారంగా మూడు రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. ఎలాంటి విచారణ చేయొద్దన్నాం. పాస్‌పోర్టుకు దరఖాస్తు సందర్భంలో జనన ధ్రువీకరణ కింద పదోతరగతి మార్కుల జాబితాతోపాటు 14 రకాల పత్రాలను అనుమతిస్తారు. వాటిల్లో ఏదో ఒకటి జత చేసినా వెంటనే జనన ధ్రువీకరణపత్రం ఇవ్వాలని స్పష్టం చేశాం.
అనుభవదార్ల పేర్లు తొలగించం
రీసర్వేలో భాగంగా గట్టు జరపబోం, అనుభవదారుల పేర్లను తొలగించబోం. న్యాయవివాదంలో ఉన్నవి తప్ప.. మిగిలిన భూ సమస్యలన్నిటికి రెవెన్యూ చట్టపరిధిలో పరిష్కారం చూపాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో తొలుత భూరికార్డుల నవీకరణ, తర్వాత గ్రామంలోని వ్యవసాయ, గ్రామకంఠం భూముల మ్యాపింగ్ చేస్తారు. అనంతరం డ్రోన్ ద్వారా తయారైన మ్యాప్‌లతో వాటిని పోలుస్తాం.. తేడాలుంటే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి, సర్వే నంబర్లవారీగా తయారైన పటాలను రైతులకు అందిస్తాం. కొలతల్లో తేడాలున్నాయని రైతులు చెబితే పొలానికి వెళ్లి కొలత వేసి సరిచేస్తారు. తర్వాత డ్రాప్ట్ విలేజి మ్యాప్ తయారు చేసి 30 రోజుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తాం. మొబైల్ మేజిస్ట్రేట్ ద్వారా వీటిని పరిష్కరిస్తాం. రీసర్వేలో సర్వే నంబర్లు కొత్తగా ఇస్తాం. ఇప్పటి వరకు 430 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయింది. ఎక్కడా కొలతల్లో తేడాలేం లేవు. 2023 డిసెంబరు నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం.
రైతు మృతి ఘటన దురదృష్టకరం..గుంటూరు రూరల్ మండలానికి చెందిన రైతు ఆంజనేయులు ఆత్మహత్య ఘటనపై అక్కడి కలెక్టర్‌తో మాట్లాడాను. ఇది మ్యుటేషన్ సమస్యలోకి వస్తుంది. రికార్డులో మూడు సర్వే నంబర్లు ఉండగా, రిజిస్ట్రేషన్ దస్తావేజులో రెండే ఉన్నాయి. అయితే విస్తీర్ణం సరిపోయింది. ఇది క్లిష్టమైన కేసు.. అయినా పరిష్కరించాలి. పొరపాటు జరిగి ఉంటే సరిదిద్దాలి. అంత వరకు పోవడం (ఆత్మహత్య వరకు) దురదృష్టకరం.
చుక్కల భూములకు పరిష్కారం:చుక్కల భూములకు సంబంధించి.. 2017 చట్టం చేసే నాటికి పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి, అంతకు 12 ఏళ్ల ముందు 1బి, అడంగల్‌లో వారి పేరు ఉంటే ఎలాంటి విచారణ అవసరం లేకుండా పాస్‌పుస్తకం ఇచ్చేస్తారు. ఇంకే పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. చుక్కల భూముల సమస్యలపై గతంలో 1.10 లక్షల దరఖాస్తులు అందగా 59,000 తిరస్కరించారు. ఇప్పుడు వాటిని కూడా పరిశీలించాలని, కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకుని పరిష్కరించాలని కలెక్టర్లకు స్పష్టం చేశాం. పత్రాల్లేవని తిరస్కరించకూడదని ఆదేశించాం.
గ్రామ సర్వేయర్‌కే బాధ్యతలు: పొలానికి హద్దులు చూపే పనిని మండల సర్వేయర్ నుంచి గ్రామ సర్వేయర్‌కు అప్పగించబోతున్నాం.
*సబ్ డివిజన్‌కు సంబంధించి.. ఇప్పటి వరకు మండల సర్వేయర్ సర్వే చేస్తే డిప్యూటి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే దాన్ని పరిశీలించి ఆమోదించాలి. ఇప్పుడు సబ్‌డివిజన్ చేసే పని గ్రామసర్వేయర్‌కు ఇచ్చి.. పరిశీలించి, ఆమోదించే బాధ్యతను మండల సర్వేయర్‌కు ఇవ్వబోతున్నాం. ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్ చొప్పున 11,000 మంది ఉన్నారు. వారికి శిక్షణ కూడా ఇచ్చాం.
ఇదీ చదవండి:జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ