తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సిబ్బంది గర్భిణీ మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రసవం కోసం వచ్చిన మహిళను పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధరాత్రి తర్వాత ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సివచ్చింది. ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తాము ప్రైవేటుకు వెళ్లాల్సి వచ్చిందని మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం అప్పు చేసి ప్రైవేటులో ప్రసవం..
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామానికి చెందిన సుమలత.. ప్రసవం కోసం శుక్రవారం రాత్రి 108 అంబులెన్సులో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. రాత్రి 9 గంటల తర్వాత పురిటినొప్పులు రాగా.. విధుల్లో ఉన్న సిబ్బందికి సమాచారం అందించారు. కాసేపు ఓపిక పట్టాలంటూ వారితో దురుసుగా ప్రవర్తించినట్లు బాధితులు ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో చేసేదేం లేక ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే ఆమెకు సాధారణ ప్రసవం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే అక్కడే ప్రసవం జరిగేదని ఆమె భర్త వాపోయారు. అప్పుచేసి మరీ ప్రైవేట్లో రూ. 15 వేలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్పత్రి సిబ్బంది వైఖరి మరోలా..
ఆయితే తమ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని, మహిళకు మొదటి కాన్పు సాధారణం కావడంతో, రెండో కాన్పు సైతం అలాగే చేయాలని వేచిచూసినట్లు ఆస్పత్రి పర్యవేక్షకురాలు రజని చెప్పారు. ఈలోపే తమకు చెప్పకుండా ప్రైవేటుకు వెళ్లిపోయారని ఆమె ఆరోపిస్తున్నారు.