దివిస్ పరిశ్రమ వివాద పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అన్ని సమస్యల పరిష్కారం అయ్యాకే దివిస్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి మరోమారు స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనలపై దివిస్ యాజమాన్యంతోనూ చర్చించినట్టు మంత్రి వెల్లడించారు. చర్చల్లో భాగంగా ప్రభుత్వం తరఫున దివిస్ యాజమాన్యానికి కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు గౌతమ్ రెడ్డి వివరించారు. దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే కేసుల ఉపసహంరణకు ముందుకు రావాల్సిందిగా ఆ సంస్థ యాజమాన్యానికి మంత్రి సూచించారు.
చర్చలు జరపాలి
కాలుష్యం విషయమై వ్యక్తం అవుతున్న అభ్యంతరాలను దివిస్ పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే స్థానిక మత్స్యకారులతో దివిస్ యాజమాన్యం చర్చలు జరపాలని మంత్రి ప్రతిపాదించారు. దివిస్ పరిశ్రమ ద్వారా విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించిన హామీ ఇవ్వాలని ప్రభుత్వం తరఫున మంత్రి కోరారు. ఈ చర్యలన్నీ ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు.