Govt Chief Whip Srikanth Reddy Fire On CBN: ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ఏ అంశంపైనైనా సరే బహిరంగ చర్చకు మేం సిద్ధమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రూ.40 వేల కోట్ల ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని.., కావాలంటే వీటి వివరాలు అందిస్తామని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ దిల్లీ పర్యటన విజయవంతమైందని..,దీన్ని తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి అంతా భ్రమరావతేనని, పది వేల కోట్లు ఖర్చు పెట్టానంటోన్న చంద్రబాబు అమరావతిలో ఎక్కడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని దుయ్యబట్టారు. అమరాతిలో చంద్రబాబు ఉంటోన్న ఇంటికి కనీసం డ్రైనేజీ కూడా నిర్మించలేదని.., డ్రైనేజీ నీటిని కృష్ణానదిలో కలుపుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు వల్లే రాష్ట్రం అప్పుల పాలు..
చంద్రబాబు వల్లే రాష్ట్రం అప్పులపాలైందని.. ఆయన చేసిన అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1.70 లక్షల కోట్లను ప్రజలకు పంచిందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాల వల్ల పేదలు ఎంత లబ్ధి పొందారో నారావారిపల్లెకే వెళ్లి చూద్దామని అన్నారు. అర్థరాత్రి ప్యాకేజీకి ఒప్పుకుని ప్రత్యేక హోదాను నిర్దాక్షిణ్యంగా చంపేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ధైర్యముంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తానని ప్రకటించాలన్నారు. సామాన్య మానవుడికి సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉంచటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.