జాతీయ విద్యా విధానం-2020 తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వ భూషణ్, ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో విజయవాడ రాజ్‌భవన్ నుంచి గవర్నర్, ఆయన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, తదితరులు పాల్గొన్నారు. దేశంలో నూతన విద్యా విధానం 2020 అమలు 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా మారిందని అన్నారు. కొత్త విధానం దేశ విద్యా చరిత్రలో ఒక పెద్ద మలుపుగా ప్రధాని అభివర్ణించారు. ఎన్ఈపీ(NEP)- 2020 భవిష్యత్ ఆధారితమైనదని, దేశ విద్యావిధానంలో డిజిటల్ విప్లవం వస్తుందని ప్రధాని చెప్పారు.
దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నూతన భారతదేశాన్ని నిర్మించడంలో NEP- 2020 ప్రధాన పాత్ర పోషిస్తుందని గవర్నర్ బిశ్వ భూషణ్ అన్నారు. కొత్త విద్యా విధానం ఆధునికత, భవిష్యత్తు ధోరణులకు అనుకూలంగా ఉన్నందున రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖ్యమంత్రి జగన్‌తోపాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, తదితరులు పాల్గొన్నారు.