Vijayawada Book Festival: చిన్నారులకు పుస్తక పఠనం అలవరచటం తల్లిదండ్రుల బాధ్యత అని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ 32వ పుస్తక మహోత్సవాన్ని గవర్నర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇతర భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగు పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలని ఆకాంక్షించారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందని తెలిపారు.
'పుస్తకం హస్త భూషణం' అన్న ప్రసిద్ధ తెలుగు సామెతను ఉటంకించటం ఇక్కడ సముచితమన్న గవర్నర్.. తాను స్వయంగా పుస్తక ప్రియుడినని, ఒడియా భాషలో దేశభక్తి సాహిత్యాన్ని, విభిన్న రచనలను అందించానని గుర్తుచేసుకున్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ గత 18 సంవత్సరాలుగా మంచి గ్రంథాలయాన్ని నిర్వహించటమే కాక, మంచి పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజలకు అందించటానికి కృషి చేయటం అభినందనీయమన్నారు.