స్వాతంత్య్ర దినోత్సవ వేళ జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్నామన్నారు. ఈ పర్వదినాన స్వాతంత్య్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని గవర్నర్ ప్రస్తుతించారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు పునఃప్రతిష్ఠ దినంగా ఈ రోజు స్ఫూర్తి నిస్తుందన్నారు.
కొవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించటం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. థర్డ్ వేవ్ ముప్పు మనపై తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని గుర్తు చేశారు. కొవిడ్ వ్యతిరేక పోరాటంలో టీకా ఉపయోగకరమైన సాధనంగా ఉండడంతో అర్హత కలిగిన వారంతా టీకాలు ఆలస్యం చేయకుండా వేయించుకోవాలన్నారు.