కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతరులకు దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. కరోనా తొలి, మలి దశల్లో పలు స్వచ్ఛంద సంస్ధలు అద్భుతంగా పని చేశాయని.. అదేక్రమంలో మూడో దశను ఎదుర్కోవడానికి తమదైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు 'థర్డ్ వేవ్ నివారణపై అవగాహన-స్వచ్ఛంధ సంస్ధల పాత్ర' అనే అంశంపై ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ పలు సూచనలు చేశారు. టీకాలు తీసుకొని వాళ్లను చైతన్యవంతం చేయాలన్నారు. మొదటి, రెెండో దశలో అనుభవాలతో ముందుకు సాగాలని.. అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ.. వెంటిలేటర్లు, బెడ్‌లు, పీపీఈ కిట్‌లు, మొదలైన వాటిని పూర్తిస్ధాయిలో సమీకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేగవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా అనేకమందిని వైరస్ బారినపడకుండా రక్షించగలిగామని పేర్కొన్నారు. వచ్చే ప్రతి దశలోనూ మనం ఎదుర్కొనే సమస్యలు విభిన్నంగా ఉంటున్నాయని.. భౌతిక దూరం పాటించడం, మూస్కులు పెట్టుకోవడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటివి మూడో దశ నివారణలో సహాయపడతాయన్నారు.