GOVERNOR BISWABHUSAN IN KOUSHAL-2021: సహజ వనరులైన నీరు, నేల, వృక్ష సంపదలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఔచిత్యాన్ని కలిగిన సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలను రక్షించడం, వాటిని అందరికీ వ్యాప్తి చేయడం మన కర్తవ్యమని ఆయన అన్నారు.
భారతీయ విజ్ఞాన మండలి, రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా కౌశల్-2021 పేరిట రాష్ట్ర స్ధాయి క్విజ్ పోటీలు నిర్వహించాయి. ఆన్లైన్ వేదికగా ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. కౌశల్ కార్యక్రమాన్ని.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించటాన్ని గవర్నర్ ప్రశంసించారు.
ఇటువంటి కార్యక్రమాలు.. గ్రామీణ విద్యార్థుల ప్రతిభను బయటకు తీసుకురావడానికి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అందించిన ‘జై జవాన్- జై కిసాన్’ నినాదం దేశంలో హరిత విప్లవాన్ని తీసుకురాగా.. పోఖ్రాన్ పరీక్ష తర్వాత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ‘జై విజ్ఞాన్’ నినాదాన్ని అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.