తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వాళ్లని ప్రభుత్వాలు దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం పేర్కొన్నారు. విజయవాడలో జరుగుతున్న భారతీయ న్యాయవాదుల పదో జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించిన ఆయన... దేశంలో నిరసన అనే పదం అసభ్యంగా, ఆమోదయోగ్యం కాని పదంగా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డును వ్యక్తిగత గుర్తింపు కార్డుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా... ప్రస్తుతం అదే అన్నిటికీ పరమావధిగా తయారైందన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు.
'నిరసన తెలిపితే దేశద్రోహులు అంటున్నారు' - సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం
దేశంలో నిరసన అనే పదం అసభ్యంగా, ఆమోదయోగ్యం కాని పదంగా మారిపోయిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం విచారం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య లౌకికవాద దేశంగా చెప్పుకునే మనదేశంలో కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తులపైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉందన్నారు. ఆకలిని జయించడంలో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, శ్రీలంక కంటే వెనుకబడి ఉన్నామని భారతీయ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు నీలోఫర్ భగవత్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, ఈ లోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ నలుమూలల నుంచి పలువురు న్యాయవాదులు, న్యాయ విద్య అభ్యసిస్తోన్న విద్యార్థులు హాజరయ్యారు.