CM Review:ఉక్రెయిన్‌లోని రాష్ట్ర ప్రజల తరలింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా కేంద్రాల్లో కాల్‌సెంటర్ల ఏర్పాటునకు సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో టచ్‌లో ఉండాలన్న సీఎం సూచించారు. యోగక్షేమాలు తెలుసుకుని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు సీఎం. రాష్ట్ర ప్రజలకు తగిన మార్గనిర్దేశం చేయాలని.. కేంద్ర అధికారులకు అవసరమైన సమాచారం ఇవ్వాలని తెలిపారు. తెలుగువారి నుంచి సమాచారం వస్తే విదేశాంగశాఖకు తెలపాలన్నారు. తెలుగువారి తరలింపులో రాష్ట్రం నుంచి సహకరించాలని అధికారులను ఆదేశించారు.
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ ఫోన్..
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని.. వారి తరలింపునకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. విద్యార్థుల తరలింపునకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని..ప్రత్యేక విమానాల్లో తరలిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
మన వారిని క్షేమంగా తీసుకొస్తాం..
ఉక్రెయిన్‌లో యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, తెలుగు పౌరులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదిస్తున్నాం. 24న విదేశాంగ శాఖ మంత్రి జయ్‌శంకర్‌కు సీఎం జగన్ లేఖ రాశారు. రాష్ట్ర అధికారులతో ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు, డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీ డాక్టర్ ఎ.బాబు, దిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, రాష్ట్ర రైతు బజారుల సీఈవో శ్రీనివాసులు, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ సీఈవో దినేష్‌కుమార్, ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం) గితేష్‌శర్మ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు, అన్ని జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు’’ అని పేర్కొన్నారు.
సహాయక కేంద్రాలకు పంపుతాం
‘‘ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవడానికి 24 గంటలు పనిచేసేలా టోల్‌ఫ్రీ నంబరు 1902తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఉక్రెయిన్‌లో ఉన్న వారి వివరాలను ఇక్కడి బంధువులు, స్నేహితులు ఎవరైనా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఆ సమాచారాన్ని ఉక్రెయిన్ సరిహద్దుల్లో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు పంపుతాం. 0863 2340678 నంబరుతో సహాయ కేంద్రాన్ని, 8500027678 నంబరుతో వాట్పస్ గ్రూపును ఏర్పాటు చేశాం. వీటితోపాటు ఏపీఎన్‌ఆర్‌టీ వెబ్‌సైట్ https://www.apnrts.ap.gov.in/ ద్వారా కూడా బాధితుల వివరాలను మాతో పంచుకోవచ్చు. జిల్ల్లాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయి. మండలాల్లో తహసీల్దార్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, ఇతరుల సమాచారాన్ని సహాయ కేంద్రాల నంబర్లకు అందించడంతోపాటు ప్రస్తుతం వారు ఏ ప్రాంతంలో ఉన్నారు? వారి మెయిల్ అడ్రసు, ఫోన్ నంబర్లను కూడా అందిస్తే సాయం అందించడం సులువుగా ఉంటుంది’’ అని సీఎస్ గుర్తుచేశారు. ఇప్పటికే అక్కడ చిక్కుకున్న కొందరు విద్యార్థులతో తాము మాట్లాడినట్లు ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం) గీతేష్‌శర్మ తెలిపారు. ఇప్పటివరకు కంట్రోల్ రూమ్‌కు 130 వరకు బాధితుల తరఫున బంధువుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని ఏపీ డెయిరీ డెలప్‌మెంట్ ఎండీ బాబు పేర్కొన్నారు.
సరిహద్దు దేశాల నుంచి తీసుకొస్తాం: జైశంకర్