ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 3, 2021, 4:38 AM IST

ETV Bharat / city

GOVERNMENT PROPOSALS TO LEASE RTC PLACES : ఆర్టీసీ స్థలాలు లీజుకు... ప్రభుత్వం ప్రతిపాదనలు

Government Proposals to Lease RTC Places : ఆర్టీసీ సంస్థ ఇక నుంచి ప్రభుత్వం చేతిలోకి వెళ్లనుంది. బస్సులు, ఆస్తులు సహా అన్నీ లీజుకు తీసుకునేలా ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసింది. రోజువారి ఖర్చులు మినహాయించి, రాబడి తీసుకునేందుకు ప్రణాళికలు రచించింది.. వీటన్నింటిని మూడేళ్లకు లీజుకు తీసుకునేలా ప్రభుత్వం.. ఆర్టీసీతో ఒప్పందం చేసుకోనుంది.

ఆర్టీసీ స్థలాలు లీజుకు
ఆర్టీసీ స్థలాలు లీజుకు

Government Proposals to Lease RTC Places : ప్రత్యేక సంస్థగా ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోనుంది. ఇందుకోసం బస్సులు, ఆస్తులు సహా ఆర్టీసీని సర్కారే లీజుకు తీసుకునేలా ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారారు. వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రోజువారీ రాబడిలో కొంత ఇవ్వాలని ఆర్టీసీని, ప్రభుత్వం కొంత కాలంగా కోరుతోంది. పీటీడీ ఉద్యోగులైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందరినీ ఆర్టీసీ వినియోగించుకుంటుండగా.. దీనిని సేవల కింద పరిగణించి ఎక్కువ మొత్తం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది.

వీటన్నింటిపై అధ్యయనం చేసేందుకు కొద్ది రోజుల కిందట ఆర్థిక నిపుణులు, అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ఇటీవల అందజేసిన నివేదికలో ఆర్టీసీని ప్రభుత్వం లీజుకు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఆర్టీసీకి ప్రస్తుతం 9,104 సొంత బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 423 బస్టాండ్లు, 129 డిపోలు, గ్యారేజీలు, 4 జోనల్‌ వర్క్‌షాపులు, 20 డిస్పెన్సరీలు, ఆసుపత్రులు తదితర ఆస్తులున్నాయి. వీటన్నింటిని మూడేళ్లకు లీజుకు తీసుకునేలా ప్రభుత్వం.. ఆర్టీసీతో ఒప్పందం చేసుకోనుంది.

నిర్వహణ ఖర్చులు పోను..

Government Proposals to Lease RTC Places : ఈ ఒప్పందం ద్వారా ఆర్టీసీ కార్యకలాపాలు అన్నీ పీటీడీ ద్వారా నిర్వహించనున్నారు. బస్సుల్లో టికెట్ల విక్రయాలు కూడా పీటీడీ తరఫునే జరుగుతాయి. రోజువారీ రాబడి ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుంది. ఆర్టీసీ రోజువారీ రాబడి లక్ష్యం రూ.15 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.12-13 కోట్ల వరకు వస్తోంది. ఇందులో ఆర్టీసీకి డీజిల్‌ వ్యయం, నిర్వహణ ఖర్చులకు 60-70 శాతం వరకు ఇచ్చి, మిగిలింది ప్రభుత్వం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

అయితే బ్యాంకు రుణాలకు వాయిదాలు, వడ్డీ కలిపి ఆర్టీసీ నెల నెలా చెల్లించాల్సిన రూ.కోట్ల మొత్తాన్ని ఇప్పుడు ఎవరు చెల్లిస్తారనేది సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే ఆర్టీసీకి చెందిన పలు స్థలాలను లీజుకిచ్చారు. మరికొన్ని బస్టాండ్లు, డిపోల పరిధిలో ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చే మొత్తాన్ని బ్యాంకు వాయిదాలు చెల్లించేందుకు వినియోగించేలా ప్రతిపాదించినట్లు సమాచారం. లీజు ప్రక్రియ ప్రతిపాదనను వివిధ శాఖలు పరిశీలించాయి. మున్ముందు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసేందుకు చివరిగా న్యాయశాఖ వద్దకు పంపారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది.

సంస్థ భవిష్యత్తు ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో.. ఆర్టీసీని సర్కారే లీజుకు తీసుకుంటే సంస్థ భవిష్యత్తు ఏమిటి? నగరాలు, పట్టణాల్లో ఆర్టీసీకి ఉన్న విలువైన ఆస్తులను ఏం చేస్తారనేది చర్చనీయాంశమవుతోంది. అధికారులు మాత్రం కేవలం కొన్ని రకాల పన్నుల భారం లేకుండా చూసేందుకే ఈ లీజు ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details