రాష్ట్రప్రభుత్వం మరో వడ్డనకు సిద్ధమవుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న స్థలాల మార్కెట్ విలువలు పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సమయాత్తమవుతోంది. ఈ శాఖ నుంచి వెళ్లిన ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల శాఖలు, మండల తహసీల్దార్ కార్యాలయాల నుంచి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వీరి ప్రతిపాదనల ఆధారంగా ఉన్నతాధికారులు ఎప్పటి నుంచి అమలుచేయాలన్న దానిపై నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రజలపై ఆర్థికభారం పెంచడంపైనే రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేకదృష్టిని కేంద్రీకరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మూడుసార్లు మార్కెట్ విలువలను సవరించింది. ఇప్పుడు నాలుగోసారీ సిద్ధమైంది. రాష్ట్రంలో జాతీయ రహదారులు 7,300 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 13,500 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఈ మార్గాల్లోని ప్రధాన కూడళ్లు, పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు, అభివృద్ధి ఆధారంగా సర్వే నంబర్లను గుర్తించి ప్రస్తుత మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయి? రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి? బహిరంగ మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు పెరిగితే ఎంత మొత్తం రావొచ్చన్న దానిపై అంచనాలు సిద్ధమవుతున్నాయి. మార్కెట్ విలువలు పెరిగేకొద్దీ.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగి రాష్ట్ర ఖజానా నిండుతుంది.
సంప్రదాయానికి తిలోదకాల:ప్రతియేటా ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పట్టణాల్లో మార్కెట్ విలువలను సవరిస్తారు. 2020లో చివరిగా మార్కెట్ విలువలను సవరించారు. కొవిడ్ కారణంగా 2021లో సవరించలేదు. రెండేళ్లకోసారి ఆగస్టు ఒకటి నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ విలువలనూ సవరిస్తారు. ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి.. డిమాండు ఆధారంగా, ఖజానా అవసరాల ప్రాతిపదికన విలువలను పెంచేస్తున్నారు. జిల్లాలకు తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో... రహదారుల వెంబడి మార్కెట్ విలువలు ఓపెన్ మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉన్నాయని, దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం రాకుండా పోతోందని, దీన్ని సవరించేందుకు ప్రతిపాదనలు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సూచించింది.