ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్‌ఆర్‌ బీమా అమలు బాధ్యత సచివాలయాలకు!

వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి కార్మికశాఖ నోడల్‌ ఏజెన్సీగా, గ్రామ, వార్డు సచివాలయాలు అమలు ఏజెన్సీగా పని చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలు, విధివిధానాలను విడుదల చేసింది. జులై ఒకటి నుంచి ఈ నూతన విధివిధానాలు అమల్లోకి రానున్నాయి. ఇందుకు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి రీ సర్వే చేసి లబ్ధిదారుల వివరాల్ని నమోదు చేస్తారు.

YSR insurance scheme
వైఎస్‌ఆర్‌ బీమా

By

Published : Jun 28, 2021, 10:38 AM IST

వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలు, విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇకపై ఈ పథకానికి కార్మికశాఖ నోడల్‌ ఏజెన్సీగా, గ్రామ, వార్డు సచివాలయాలు అమలు ఏజెన్సీగా పని చేస్తాయి. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబంలో ప్రధానంగా సంపాదించే వ్యక్తి 18-50 ఏళ్ల మధ్య ఉన్నవారు సహజ మరణం పొందితే ఆ కుటుంబంలోని నామినీకి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రూ.లక్ష పరిహారం చెల్లిస్తుంది. అదే 18-70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందినా, శాశ్వత వైకల్యానికి గురైనా బీమా కంపెనీ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందేలా చేస్తుంది. ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరణం సంభవించిన 15 రోజుల్లోగా క్లెయిమ్‌లు పరిష్కరించాలి. జులై ఒకటి నుంచి ఈ నూతన విధివిధానాలు అమల్లోకి వస్తాయి. ఇందుకు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి రీ సర్వే చేసి లబ్ధిదారుల వివరాల్ని నమోదు చేస్తారు. సచివాలయాలన్నింటినీ వైఎస్‌ఆర్‌ బీమా ఫెసిలిటేషన్‌ కేంద్రాలుగా నోటిఫై చేశారు.

బీమా మిత్రల భవితవ్యమేంటి?
వైఎస్‌ఆర్‌ బీమా పథకం అమలు గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడంతో ప్రస్తుతం ఆ బాధ్యతలను చూస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) పరిధిలోని బీమా మిత్రల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,350 మంది బీమా మిత్రలు ఉన్నారు. వీరు మృతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తూ లబ్ధిదారులకు బీమా సాయం అందేలా చూస్తున్నారు. ఒక్కో క్లెయింకు రూ.1000 ఇన్సెంటివ్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది. తాజాగా ఆదివారం విడుదల చేసిన జీవోలో ఆ బాధ్యతల నుంచి సెర్ప్‌ను తొలగించింది. సచివాలయాలు బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించేంత వరకు సహకారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్‌ వివరాలను అప్‌లోడ్‌ చేసేందుకు వీరికి లాగిన్‌ అవకాశం కల్పించలేదు. కొత్త విధానం అమల్లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని బీమా మిత్రలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సెర్ప్‌ అధికారులూ స్పష్టత ఇవ్వడం లేదు. సెర్ప్‌ సీఈవో రాజబాబును వివరణ కోరగా బీమా మిత్రల కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి

మాన్సాస్‌ భూములపై సర్వే..రెండు వారాల్లో నివేదిక!

ABOUT THE AUTHOR

...view details