సమస్యలపై ఉద్యమించే సకల జనుల సమర భూమి విజయవాడలోని ధర్నాచౌక్. నిరసన గళాలను ప్రపంచమంతా ప్రతిధ్వనింపజేసే ఈ రాష్ట్ర స్థాయి వేదికను ప్రభుత్వమే రోజురోజుకు కుదిస్తోంది. కాల్వ గట్టు వెంట కిలోమీటరు పొడవునా ఉండే ధర్నాచౌక్.. ప్రస్తుతం 100 మీటర్లే మిగిలింది. ఏడాదిన్నర కిందటి వరకు ఒకేసారి 4వేల మంది.. విడివిడిగా 10కిపైగా ధర్నాలు చేసుకునేలా స్థలం అందుబాటులో ఉండేది. ఇప్పుడు 200 మందికే ఇరుకుగా అనిపిస్తోంది. ఒకేసారి రెండుకు మించి ధర్నాలు చేయాలంటే స్థలమే లేదు. ఈ ప్రాంతంలో కొత్తగా ఆటో, ట్యాక్సీ స్టాండుల ఏర్పాటుకు, రైతు బజారు నిర్మాణానికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది.
రాజధాని ప్రాంతంగా విజయవాడ ఎంపిక కాకముందు లెనిన్ కూడలి వద్ద ధర్నాచౌక్ ఉండేది. ఆ తర్వాత విజయవాడ అలంకార్ కూడలి నుంచి గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ వరకు ఉన్న కాలువ గట్టుపై ఒక కిలోమీటరు ప్రాంతాన్ని గత ప్రభుత్వం ధర్నాచౌక్‌గా ఎంపిక చేసింది. అప్పటి నుంచి రాష్ట్రస్థాయి పోరాటాలు, సమస్యలకు సంబంధించిన ధర్నాలన్నీ ఇక్కడే జరిగేవి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనూ ఇక్కడ రోజూ పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు జరిగేవి. గతేడాది కొవిడ్ తొలిదశ ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం వివిధ అవసరాలకు కేటాయించింది. హనుమాన్‌పేట సమీపంలోని ఆటో, ట్యాక్సీ స్టాండుల్ని, మెకానిక్ గ్యారేజీలు, చిరువ్యాపారాలకు ధర్నాచౌక్ ప్రాంతంలో స్థలం కేటాయించింది. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలోని రైతుబజార్‌నూ ఇక్కడికే తరలించి నిర్మిస్తోంది.