Government Green Signal for 2910 posts: తెలంగాణ రాష్ట్రంలో మరో 2910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 663 గ్రూప్-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి అనుమతించింది. అలాగే, పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా అనుమతితో ఉద్యోగాల నియామక ప్రక్రియలో యాభై వేల మైలురాయిని అధిగమించినట్లు ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గడచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్న హరీష్ రావు... ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్ఓ పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 38 చేనేత ఏడీఓ పోస్టులు, 25 ఆర్థికశాఖ ఏఎస్ఓ పోస్టులు, 15 అసెంబ్లీ ఏఎస్ఓ పోస్టులు, 14 గ్రేడ్ టూ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు, తొమ్మిది ఏఎల్ఓ, ఆరు న్యాయశాఖ ఏఎస్ఓ పోస్టులు ఉన్నాయి.