ప్రభుత్వ ఉత్తర్వులను ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2008 నుంచి జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచే విధానానికి స్వస్తి పలకటంతో.. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు కనబడవు. ప్రభుత్వం జీవోల్ని ఉంచే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్‌లో(జీవోఐఆర్) జీవో నంబర్లు జనరేట్ చేసే విధానాన్ని ఇకపై అనుసరించొద్దని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై జీవోలకు నంబర్లు కేటాయించి ప్రదర్శించటమనేది ఏపీ సచివాలయం ఆఫీస్ మాన్యువల్, ప్రభుత్వ బిజినెస్ రూల్స్‌కు అనుగుణంగా జరగాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి బ్లాంక్ జీవోలు ఇవ్వటం మొదలు పెట్టింది. జీవో నెంబర్ ఇచ్చినా.. అందులో ఎలాంటి సమాచారం లేకుండా ఖాళీగా ఉంచుతున్నారు. ముఖ్యంగా సాధారణ పరిపాలనశాఖ ఈ 16 రోజుల్లో 82 జీవోలు జారీ చేస్తే.. వాటిలో 49 బ్లాంక్‌గా ఉంచింది. మరో నాలుగు జీవోలను కాన్ఫిడెన్సియల్‌గా పేర్కొని.. వాటినీ రహస్యంగా ఉంచింది. న్యాయశాఖ రెండు, అటవీశాఖ ఒక ఖాళీ జీవోలను ప్రదర్శించాయి. గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేశ్ కుమార్ మీనా సహా కొందరు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ, కొందరికి కొన్ని శాఖలకు ఇన్‌ఛార్జులుగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో నెం 1334 జారీ చేసింది. దాన్నీ బ్లాంక్‌గానే పెట్టారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్‌నీ బదిలీ చేసింది. ఈ నిర్ణయాలు ప్రజలకు తెలిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమిటో వాటిని ఎందుకు రహస్యంగా ఉంచాలనుకుందో అంతు చిక్కటం లేదు. బ్లాంక్ జీవోల అంశాన్ని ఇటీవల తెలుగుదేశం నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే జీవోలకు నెంబర్లు కేటాయించే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలకం చర్చనీయాంశమైంది.
సమాచారహక్కు చట్టంలోని సెక్షన్-4ను ఉల్లంఘించినట్లే..