రాష్ట్రంలో పర్యటక రంగాన్ని రూ.202 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం లభించిందని చెప్పారు. రూ.142 కోట్ల రుణాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు. రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) నుంచి మరో రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు.
పర్యటక హోటళ్లలో గదుల ఆధునికీకరణ, లంబసింగి, జగత్పల్లి, మారేడుమిల్లిలో రిసార్ట్‌ల అభివృద్ధి, అరకులోయలో గిరిజన ఉత్పత్తుల విక్రయ కేంద్రం, డ్రైవ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కడప జిల్లా గండికోటలో తీగ మార్గం (రోప్ వే) ఏర్పాటు, వైఎస్‌ఆర్ స్మారకంగా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.