కొత్త మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ తుది కసరత్తు.. జాబితా ఎప్పుడంటే? - సీఎం జగన్తో సజ్జల భేటీ
14:40 April 09
సీఎంతో ప్రభుత్వ సలహాదారు భేటీ.. మంత్రివర్గ విస్తరణపై చర్చ
CM Jagan Review on New Cabinet: రాష్ట్రంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ వైకాపా నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. తమ నాయకుడికి మంత్రి పదవి వరిస్తుందో లేదోనని పలువురు కీలక నేతల అనుచరులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. మరో వైపు ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో ఎవరిని కంటిన్యూ చేస్తారనే దానిపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో మంత్రుల జాబితా రూపకల్పనలో జగన్ నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంతో సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చించారు. సీఎంతో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. చివరి క్షణం వరకూ ఈ చర్చలు కొనసాగుతాయని చెప్పడంతో వైకాపా శ్రేణుల్లో ఉత్కంఠ రెట్టింపైంది.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా ఆహ్వానాలు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎంవో అధికారులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. మంత్రుల రాజీనామాలతో పాటు కొత్త మంత్రుల జాబితా కూడా సీల్డ్ కవర్‌లో గవర్నర్‌కు పంపనున్నారు. పాత కేబినెట్ నుంచి 8 నుంచి 10 మంది మంత్రులను కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కుల సమీకరణ, కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకొని మిగతావారిని ఎంపిక చేసేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న 24 మంది మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకోవడంతో పాతవారిలో ఎవరిని మంత్రివర్గంలో కొనసాగిస్తారనే దానిపై వైకాపాలో జోరుగా చర్చ జరుగుతోంది.
రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని సీఎం ముందుగా ప్రకటించినట్టే చేస్తారా? అనే దానిపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాకో మంత్రి పదవి వస్తుందని మాత్రం అందరూ భావిస్తున్నారు. జిల్లాకో మంత్రి పదవి చొప్పున ఇస్తే... సామాజిక సమీకరణల్లో తేడాలు వస్తున్నట్టు సమాచారం. దీంతో కొందరు పాతవారిని కొనసాగించాలనే దానిపై, సామాజిక సమీకరణలు, జిల్లాల వారీగా మంత్రి పదవుల పంపకంపై సమతూకం పాటించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోందని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు కూడా రానుండంటంతో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో వైకాపాను విజయతీరాలకు చేర్చే జగన్ జట్టు ఎలా ఉంటుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది.
- ఇదీ చదవండి: Power Holiday Affect: విజయవాడ పారిశ్రామికవాడలో పవర్ హాలిడే ప్రభావం.. ఆందోళనలో వ్యాపారులు