దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలతోపాటు మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సేవలకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. జూన్ 30వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటిస్తూనే.. వీటిని తెరుచుకునేందుకు పాక్షికంగా సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని చోట్లా మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఎక్కడా బహిరంగంగా ఉమ్మి వేయరాదని పేర్కొంది.
అయితే.. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై ఇప్పటికీ నిషేధం ఉందని ఉత్తర్వుల్లో గుర్తు చేసింది. షాపింగ్ మాల్స్‌లో శీతలీకరణ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలని స్పష్టం చేసింది.
దేవాలయాల వద్ద క్యూ మేనేజ్మెంట్ సవ్యంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా చూడాలంది. తీర్థ ప్రసాదాలను పంచేందుకు కానీ, పవిత్ర జలాలను పైన చల్లేందుకు కానీ అవకాశం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది. సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ప్రార్థనా మందిరాల్లో కింద కూర్చొనేందుకు ఎవరి వస్త్రం వారే తెచ్చుకోవాలని సూచించింది.