రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని... గవర్నర్ బిశ్వభూషణ్ కార్యాలయం ప్రభుత్వానికి తిప్పి పంపింది. శ్రీవేంకటేశ్వర వర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, ద్రవిడ విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున, ఆంధ్ర వర్సిటీల ఉపకులపతుల నియామక దస్త్రాలను.... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్‌కు పంపించింది. సంబంధిత దస్త్రాన్ని గవర్నర్ కార్యాలయం 20 రోజులపాటు పెండింగ్‌లో పెట్టింది. అనంతరం న్యాయనిపుణుల సలహా తీసుకుని వెనక్కి పంపింది. ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు దస్త్రం అందినట్లు సమాచారం.
ఉపకులపతుల నియామక దస్త్రం వెనక్కి పంపిన గవర్నర్ కార్యాలయం - ఉపకులపతుల నియామక దస్త్రాలు వెనక్కు పంపిన గవర్నర్ న్యూస్
ఉపకులపతుల నియామక దస్త్రాన్ని గవర్నర్ కార్యాలయం తిప్పి పంపింది. 20 రోజులపాటు దస్త్రాన్ని పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ కార్యాలయం, న్యాయనిపుణుల సలహా తర్వాత వెనక్కి పంపించింది. ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ ప్రభుత్వం దస్త్రం రూపొందించినట్లు తెలుస్తోంది.
గతేడాది డిసెంబర్ 16న విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. అక్షర క్రమంలో ముగ్గురు వ్యక్తులతో సెర్చ్ కమిటీ ఒక ప్యానెల్‌ను ప్రభుత్వానికి సమర్పిస్తుందని, ప్రభుత్వ సిఫార్సుపై ప్యానెల్ నుంచి ఒకరిని ఉపకులపతిగా కులపతి నియమించాలని సవరణ చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారం ఉపకులపతుల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉండదు. సెర్చ్ కమిటీ సూచించిన మూడు పేర్ల నుంచి ఒకరిని.. కులపతి హోదాలో ఉన్న గవర్నర్ నియమిస్తారు. అలా కాకుండా ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఉపకులపతులను నియమించాలని విశ్వవిద్యాలయాల చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. వీసీల నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గించేందుకు యూజీసీ 2010లో పలు మార్పులు తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణను సవాలు చేస్తూ.. గత ఆగస్టులో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:'సీఎం గారూ.. నాకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించండి'