రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. 2021-21 ఆర్థిక సంవత్సరంలో "కొంత భాగానికి" 70,983 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆమోదిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జారీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 7,955 కోట్ల రూపాయల అదనపు వ్యయానికి ఆమోదం తెలుపుతూ రెండో ఆర్డినెన్స్ ను జారీ చేశారు.
వరుసగా మూడో ఏడాదీ
రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలు చిక్కలేదని, అందువల్ల ఓటాన్ అకౌంట్‌ను ఆమోదిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది.
కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర చెల్లింపులు జరపాలన్నా బడ్జెట్ ఆమోదం తప్పనిసరి. అది వీలుకానప్పుడు ఓటాన్ అకౌంట్ ఆమోదిస్తారు.
- ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించడం ఇదే తొలిసారి.
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధారణ ఎన్నికల కారణంగా తొలుత మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆనక పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ఆమోదించుకుంది.
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా బడ్జెట్ సమావేశాలకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఆ ఏడాదీ తొలుత ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్సు ఇచ్చారు.
- ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఓటాన్ అకౌంట్‌ను ఆర్డినెన్సు జారీ చేశారు. జూన్ నెలాఖరులోపు తిరిగి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంటుంది.