ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి నూతన పోలీస్ బాస్​గా గౌతమ్ సవాంగ్?

రాష్ట్రానికి కొత్త పోలీస్‌ బాస్‌గా..గౌతమ్‌ సవాంగ్‌ పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్థానంలో ఆయన్ని నియమించనున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)

By

Published : May 26, 2019, 5:59 AM IST

మార్పులు- చేర్పులు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం, ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పోలీసు శాఖలో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పదోన్నతులు, బదిలీల వంటి విషయాలపై కార్యాచరణ ఇప్పటినుంచే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు. 2001- 2003 మధ్య వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2003-2004 మధ్య ఎస్‌ఐబీ డీఐజీగానూ 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా సేవలందించారు. అనంతరం డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2005-2008 మధ్య సీఆర్​పీఎఫ్ డీఐజీగానూ 2008-2009 మధ్య శాంతిభద్రతల డీఐజీ గానూ గౌతమ్‌ సవాంగ్‌ విధులు నిర్వర్తించారు. రాష్ట్ర పోలీసు పటాలం అదనపు డీజీగానూ పని చేశారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా తనదైన ముద్ర వేసిన ఆయన గతేడాది జూలై నుంచి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు.
మరికొన్ని శాఖల్లోనూ మార్పులు
ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ ఉన్నారు. గతేడాది జూలై 1నుంచి ఠాకూర్‌ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ నియామకం అవుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఈనెల 30న జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో..భద్రతా ఏర్పాట్లు, పోలీసు శాఖ పరమైన పనులన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణస్వీకార వేదిక ఏర్పాట్లపై..నిన్న అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఇంటిలిజెన్స్, ఏసీబీ శాఖల్లోనూ భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొందరు అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 3 నెలల్లో మరిన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details