విజిలెన్స్ బృందాల ప్రాథమిక విచారణలో ఇది తేలిందన్నారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వీజీ వెంకటరెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆండ్రూ మినరల్స్ పాత రికార్డులను పరిశీలిస్తే.. 34 లక్షల టన్నుల లేటరైట్‌ను వేదాంత అల్యూమినియం కంపెనీకి సరఫరా చేశారని, 4.5 లక్షల టన్నులు చైనాకు ఎగుమతి చేసినట్లు గుర్తించామని చెప్పారు. ఖనిజంలో 38% కంటే తక్కువ అల్యూమినియం ఉంటే దానిని లేటరైట్‌గా, అంతకంటే ఎక్కువ ఉంటే బాక్సైట్‌గా జీఎస్‌ఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు చేశారా? అనే సందేహాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పారు.
ఆండ్రూ మినరల్స్ లీజుల్లో లభించేది బాక్సైట్ అయితే తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో నాతవరం మండలం భమిడికలొద్ది లీజులో లభించేదీ బాక్సైటే కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఈ రెండు ప్రాంతాలకు చాలా దూరం ఉందని వెంకటరెడ్డి తెలిపారు. 2019 నుంచి తవ్వకాలు ఆపేస్తే.. ఇప్పుడు తనిఖీలు ఎందుకని అడగ్గా, అక్కడ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. అక్రమ తవ్వకాలపై అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించగా.. ఇందులో తమ సిబ్బంది బాధ్యతా ఉంటుందని, వారి పాత్ర తేలితే చర్యలు ఉంటాయని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
డిపోల వారీగా ఇసుక ధరలు
రాష్ట్రంలోని 130 డిపోలు, నిల్వ కేంద్రాల్లో 60 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామని, అక్కడ ధర ఎంతనేది ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. డీజిల్ ధర పెరిగినందున.. ధర పెంచాలని జేపీ సంస్థ కోరిందని, స్వల్పంగా ధర హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. రీచ్ నుంచి 10 కి.మీ.లోపు ఉండే డిపోల్లో టన్ను రూ.475కే విక్రయిస్తారని, 10-40 కి.మీ. దూరంలో ఉండే డిపోల్లో ఒక ధర, అంతకంటే ఎక్కువ దూరం ఉండే డిపోల్లో మరొక ధర ఉంటుందని చెప్పారు. ఇసుక సబ్‌లీజుల పేరిట జరిగిన వసూళ్లలో పాత్ర ఉందని ఆరోపణలు వచ్చిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సోదరుడిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా.. ఆ కేసును ఎస్‌ఈబీ చూస్తోందని, తమకు తెలియదని ద్వివేది తెలిపారు.
కొద్దిరోజుల కిందట గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడినప్పుడు ఏజెన్సీలో ఎత్తైన కొండల్లో బాక్సైట్ ఏర్పడుతుందని, కిందకి వచ్చేసరికి దాని గ్రేడ్ తగ్గి లేటరైట్‌గా ఉంటుందని చెప్పారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏజెన్సీ దిగువ ప్రాంతాల్లో లేటరైట్ నిల్వలు ఉన్నట్లు గతంలో జీఎస్‌ఐ పేర్కొందన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలోని వివాదంగా మారిన భమిడికలొద్ది లీజులో లభించేది లేటరైటేనని, బాక్సైట్ కాదని అప్పట్లో వివరణ ఇచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వంతాడ సమీపంలోని ఏజెన్సీకి దిగువన ఉండే ఆండ్రూ మినరల్స్‌కు చెందిన లేటరైట్ లీజుల్లో బాక్సైట్ తవ్వినట్లు అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే భమిడికలొద్దిలో లభించేదీ బాక్సైటే అవుతుంది కాదా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి..